Minapa Garelu : మినపప్పును కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మినపప్పుతో ఎక్కువగా అల్పాహారాలను తయారు చేస్తూ ఉంటాం. మినపప్పుతో చేసిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. మినపప్పుతో మనం ఎంతో రుచిగా ఉండే గారెలను కూడా తయారు చేసుకోవచ్చు. మినపగారెలను తరచుగా తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ మినపగారెలను రుచిగా, చక్కగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మినప గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక గ్లాస్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2.
మినపగారెల తయారీ విధానం..
ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత మినపప్పును జార్ లో లేదా గ్రైండర్ లోకి తీసుకోవాలి. తరువాత తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని కొద్ది మోతాదులో తీసుకుని నీటిలో వేసి చూస్తే పిండి పైకి తేలాలి. ఇలా తేలితే పిండిని చక్కగా రుబ్బుకున్నట్టు అర్థం. ఇప్పుడు పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకే దిశలో బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేతులకు తడి చేసుకుంటూ ప్లాస్టిక్ కవర్ మీద లేదా అరటి ఆకు మీద గారెను వత్తుకుని నూనెలో వేసుకోవాలి.
ఇలా తగినన్ని గారెలు వేసుకున్న తరువాత వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మినపగారెలు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీ లేదా నాన్ వెజ్ కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఉదయం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా లేదా పండుగలకు ఇలా మినపప్పుతో గారెలను తయారు చేసుకుని తినవచ్చు. ఎన్ని తినామో కూడా తెలియకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు.