Bonda : మనకు హోటల్స్ లో లభించే వివిధ రకాల అల్పాహారాల్లో బోండాలు ఒకటి. వీటిని మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. బోండాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ బోండాలను మనం ఎక్కువగా మైదా పిండితో తయారు చేస్తూ ఉంటాం. మైదా పిండితో చేసే బోండాలు రుచిగా ఉన్నప్పటికి వీటిని తరచూ తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కేవలం మైదాపిండితోనే కాకుండా ఈ బోండాలను మనం గోధుమపిండితో కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసే ఈ బోండాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. గోధుమపిండితో బోండాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, పుల్లటి పెరుగు – అర కప్పు, ఉప్పు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, బియ్యం పిండి – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – అర కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వంటసోడా – పావు టీ స్పూన్, వేడి నూనె – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
గోధుమపిండి బోండా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా చేసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి. తరువాత గోధుమపిండి, బియ్యం పిండి వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ గంటె జారుడుగా కలుపుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి ఒకే దిశలో బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతపెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. పది నిమిషాల తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బోండాల లాగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి బోండాలు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ బోండాలను ఒక్కటి ఎక్కువగా తిన్నా కూడా ఆరోగ్యానికి అంతగా హాని కలగకుండా ఉంటుంది.