Kobbari Muttilu : మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పచ్చి కొబ్బరి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యంతో పాటు చర్మాన్ని, జుట్టును అందంగా ఉంచడంలో కూడా ఇది మనకు సహాయపడుతుంది. ఈ పచ్చి కొబ్బరితో కూడా మనం రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా, తక్కువ సమయంలో, సులభంగా చేసుకోగలిగే కొబ్బరి ముట్టిలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి ముట్టిలు తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరికాయ – 1, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 6 లేదా తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు – 4, అల్లం – ఒక ఇంచు ముక్క, పుదీనా తరుగు – కొద్దిగా, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, బి య్యం – 2 టీ స్పూన్స్, శనగపిండి – 2 టీ స్పూన్స్, గరం మసాలా – పావు టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కొబ్బరి ముట్టిల తయారీ విధానం..
ముందుగా కొబ్బరి కాయ నుండి కొబ్బరిని సేకరించి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను ఒక జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, పుదీనా వేసి మర మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని కొబ్బరి మిశ్రమంలో వేసుకోవాలి. తరువాత ఇందులో శనగపిండి, బియ్యంపిండి, ఉప్పు, గరం మసాలా వేసి కలుపుకోవాలి. పిండి పలుచగా ఉండే మరింత శనగపిండిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేతికి నీళ్లు లేదా నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వడలుగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి.
వీటిని నూనెలో వేయగానే కదిలించకూడదు. కొద్దిగా వేగిన తరువాత అటూ ఇటూ కదుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి ముట్టిలు తయారవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు, ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఎంతో రుచిగా ఉండే కొబ్బరి ముట్టిలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఒకటి ఎక్కువగానే తింటారు. బయట లభించే చిరుతిళ్లను తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి బదులుగా ఇలా ఇంట్లోనే కొబ్బరి ముట్టిలను తయారు చేసుకుని తినవచ్చు.