Dry Fruit Kova Rolls : మనం వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. డ్రైఫ్రూట్స్ మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వీటిని నేరుగా తినడంతో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ తో మనం రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్ తో చేసుకోదగిన తీపి వంటకాల్లో డ్రై ఫ్రూట్ కోవా రోల్ కూడా ఒకటి. ఇవి మనకు స్వీట్ షాపుల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఈ రోల్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటాయి. ఈ కోవా రోల్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కోవా రోల్స్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్ కోవా రోల్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – లీటర్, పంచదార – 200 గ్రా., చిన్నగా తరిగిన జీడిప్పు పలుకులు – పావు కప్పు, చిన్నగా తరిగిన బాదం పప్పు పలుకులు – పావు కప్పు, నెయ్యి – అర టీ స్పూన్, ఎల్లో ఫుడ్ కలర్ – చిటికెడు, తరిగిన పిస్తా పప్పు – అర కప్పు.
డ్రై ఫ్రూట్ కోవా రోల్ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే ఇనుప కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. వీటిని చిన్న మంటపై మూడు వంతులు మరిగే వరకు కలుపుతూ వేడి చేయాలి. పాలు మరిగి దగ్గర పడిన తరువాత పంచదార వేసి కలపాలి. ఇలా కలిపిన తరువాత పాలు మరింత దగ్గరపడి కోవా లాగా తయారవుతాయి. కోవా తయారైన తరువాత కొద్దిగా కోవా మిశ్రమాన్ని చేత్తో తీసుకుని ఉండలా చుట్టి చూడాలి. ఈ మిశ్రమం ఉండలా చుట్టడానికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే మరికొద్ది సేపు దీనిని ఉడికించాలి. ఇలా కోవా తయారైన తరువాత గుంత గంటెతో కోవాను కళాయికి రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కోవా చల్లబడడంతో పాటు మెత్తగా కూడా అవుతుంది. ఇప్పుడు కోవాను ఒక భాగం కళాయిలో ఉంచి మిగిలిన భాగాన్ని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఉంచిన కోవాలో ఫుడ్ కలర్, బాదం పప్పు , జీడిపప్పు పలుకులు, నెయ్యి వేసి కలపాలి.
తరువాత కొద్ది కొద్దిగా కోవా మిశ్రమాన్ని తీసుకుంటూ చేత్తో సన్నగా పొడుగ్గా రోల్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన కోవా మిశ్రమంలో నెయ్యి వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను చెక్క అప్పలాగా వత్తుకోవాలి. తరువాత దీని మధ్యలో రోల్ గా చుట్టుకున్న ఎల్లో కోవా మిశ్రమాన్ని ఉంచి గుండ్రంగా చుట్టుకోవాలి. తరువాత దీనిపై పిస్తా పప్పును అద్దాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ కోవా రోల్ తయారవుతుంది. దీనిని రోల్ ఆకారంలోనే కాకుండా మనకు నచ్చిన ఇతర ఆకారాల్లో కూడా చుట్టుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు, ప్రత్యేక సందర్భాల్లో బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే కోవా రోల్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ రోల్స్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.