Heart Attack : ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే. గుండె నొప్పి, గుండె జబ్బుల కారణంగా నిమిషాల వ్యవధిలోనే మరణం సంభవిస్తుంది. శరీరంలో ఇతర అవయవాలు దెబ్బతిన్నా కూడా కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు మనం బతికి ఉండవచ్చు. కానీ గుండె సంబంధిత సమస్యలు తలెత్తితే మాత్రం చాలా మంది ప్రాణాలను కోల్పోతూ ఉంటారు. హార్ట్ ఎటాక్స్ అనేవి ప్రస్తుత కాలంలో యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నాయి. ఈ హార్ట్ ఎటాక్స్, రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, బీపీ వంటి సమస్యలు వంశపారపర్యంగా కూడా వస్తాయి. జన్యుపరంగా ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న వారు ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన పూర్వీకుల్లో ఎవరికైనా గుండె జబ్బులు, గుండెకు స్టంస్ట్స్ వేయడం, బైపాస్ చేయడం వంటివి జరిగితే ఆ సమస్యలు మనకు కూడా వచ్చే అవకాశం 70 నుండి 80 శాతం వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా వంశపారపర్యంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్న వారు ముందు ఎటువంటి సమస్య లేకపోయినా 25 నుండి 30 సంవత్సరాల వయసు నుండే వైద్యున్ని సంప్రదించి తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా రక్తంలో అడ్డంకులు 30 నుండి 40 శాతం వరకు ఉంటే మన ఆహారపు అలవాట్లను మర్చుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. అలాగే ఈ అడ్డంకులు 70 నుండి 80 శాతం వరకు ఉండే మందులు వాడడమో, స్టంస్ట్స్ వేయించుకోవడమో చేయాలి. ఇలా ముందుగానే తెలుసుకోవడం వల్ల ప్రాణాలు పోకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ప్రస్తుత కాలంలో ఎవరికి ఏ నిమిషంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కనుక వంశపారపర్యంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు సంవత్సరానికి ఒక్కసారైనా కార్డియాలజిస్ట్ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే రక్తపోటు పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే మన ఆహారపు అలవాట్లల్లో కూడా మార్పులు చేసుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలను, జంక్ ఫుడ్ ను అస్సలు తీసుకోకూడదు. సాయంత్రం భోజనాన్ని త్వరగా చేయాలి. అలాగే ఈ భోజనంలో సలాడ్స్, ఫ్రూట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ఇవి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడేలా, రక్తపోటు అదుపులో ఉండేలా చేయడంలో పండ్లు, కూరగాయలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
అలాగే మధ్యాహ్నం పూట కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా తయారవుతుంది. అన్నాన్నికి బదులుగా రెండు పుల్కాలు లేదా జొన్న రొట్టె వంటి వాటిని ఎక్కువ కూరతో తీసుకోవాలి. అలాగే ఉదయం పూట అల్పాహారాలకు బదులుగా మొలకెత్తిన గింజలను, పండ్ల ముక్కలను, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. వీటితో పాటు వ్యాయామాలు చేయడం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తుల్లో కూడా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.