Rice Flour Biscuits : బియ్యంపిండితో మనం రకరకాల పిండి వంటలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. తీపి వంటకాలు, పిండి వంటలే కాకుండా ఈ బియ్యం పిండితో మనం ఎంతో రుచిగా ఉండే బిస్కెట్లను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బియ్యం పిండి బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. మొదటిసారి చేసే వారు కూడా వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ బియ్యం పిండి బిస్కెట్లను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి బిస్కెట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక కప్పు, పంచదార – అర కప్పు, కరిగించిన బటర్ – ఒక టేబుల్ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – తగినంత.
బియ్యం పిండి బిస్కెట్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పంచదార, పిండికి తగినన్ని నీటిని పోసి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత అందులో బియ్యం పిండి, వంటసోడా, ఉప్పు, యాలకుల పొడి, కరిగించిన బటర్ వేసి చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. తరువాత పిండిని రెండు నుండి మూడు భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో భాగాన్ని తీసుకుంటూ మందంగా చపాతీలా వత్తుకోవాలి. తరువాత అంచులు పదునుగా ఉండే చిన్న మూతతో లేదా గిన్నెతో ఈ చపాతీని బిస్కెట్ల ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని బిస్కెట్లను కట్ చేసుకున్న తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కట్ చేసుకున్న బిస్కెట్లను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి బిస్కెట్లు తయారవుతాయి. ఈ బిస్కెట్లు వారం నుండి పది రోజుల వరకు తాజాగా ఉంటాయి. బయట లభించే మైదా పిండి బిస్కెట్లను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే బియ్యం పిండితో రుచిగా బిస్కెట్లను తయారు చేసుకుని తినవచ్చు. ఈ బిస్కెట్లను పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.