Ulavacharu : మనం ఉలవలను కూడా ఆహారంగా తీసుకుంటాం. ఉలవల్లో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. వీటిని తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఉలవలను గుగ్గిళ్లుగా తయారు చేసుకుని తినడంతో పాటు వాటితో చారును కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఉలవ చారు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ చారును ఇష్టంగా తింటారు. ఉలవచారును తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ ఉలవచారును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉలవచారు తయారీకి కావల్సిన పదార్థాలు..
12 గంటల పాటు నానబెట్టిన ఉలవలు – 300 గ్రా., పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాట – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, నానబెట్టిన చింతపండు – 30 గ్రా., కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, బెల్లం – చిన్న ముక్క, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – ఒక రెమ్మ.
ఉలవచారు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నానబెట్టుకున్న ఉలవలు, ఒక లీటర్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి. తరువాత వీటిని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఒక విజిల్ వచ్చిన తరువాత మంటను చిన్నగా చేసి ఒక గంట పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి ఉలవలు ఉడికించిన నీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఉడికించిన ఉలవలను జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉలవల నీటిని తీసుకున్న గిన్నెను స్టవ్ మీద ఉంచి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాట ముక్కలు, కారం, ఉప్పు, చింతపండు రసం వేసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. ఇలా మరిగిన తరువాత అందులో మిక్సీ పట్టుకున్న ఉలవల పేస్ట్ వేసి కలిపి మరో అర గంట పాటు మరిగించాలి.
తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. తాళింపు దినుసులు వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఈ తాళింపును ముందుగా మరిగించిన చారులో వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉలవల చారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.