Bhindi 65 : బెండకాయలతో చేసే వివిధ రకాల వంటకాల్లో బెండకాయ 65 కూడా ఒకటి. దీనిని మనకు విందుల్లో ఎక్కువగా వండిస్తూ ఉంటారు. అలాగే కర్రీ పాయింట్ లలో కూడా ఈ వంటకాన్ని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ బెండకాయ 65 ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బెండకాయ 65 ను ఏ విధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత బెండకాయలు – అర కిలో, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 5, వెల్లుల్లి రెబ్బలు – 6, జీలకర్ర – ఒక టీ స్పూన్, శనగపిండి – పావు కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, పల్లీలు – పావు కప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు, గరం మసాలా – పావు టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము – 2 టీ స్పూన్స్.
బెండకాయ 65 తయారీ విధానం..
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత బెండకాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, జీలకర్ర, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. తరువాత రెండు లేదా మూడు టీ స్పూన్ల నీళ్లు పోసి పిండిని ముక్కలకు పట్టించాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కరివేపాకు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వాటిలో గరం మసాలా, పచ్చి కొబ్బరి తురుము వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ 65 తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్, రసం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా బెండకాయ 65 ను కూడా తయారు చేసుకుని తినవచ్చు.