Uthappam : మనం ఆహారంగా తీసుకునే అల్పాహారాల్లో ఊతప్పం ఒకటి. దోశ పిండితో చేసే ఈ ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద కూడా ఈ ఊతప్పం విరివిరిగా లభిస్తూ ఉంటుంది. అలాగే మనం ఇంట్లో కూడా దీనిని తయారు చేస్తూ ఉంటాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ ఊతప్పం పై కారం పొడి వేసి మరింత రుచిగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. కారం పొడి వేసి చేసే ఈ ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కారం పొడి వేసి ఊతప్పాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఊతప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, దోశ బియ్యం – రెండున్నర కప్పులు, మెంతులు – ఒక టీ స్పూన్, అటుకులు – అర కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – రెండు చిటికెలు, ఉల్లిపాయ తరుగు – ఒక కప్పు, క్యారెట్ తురుము – ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 10, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – పావు కప్పు, మినపప్పు – 2 టీ స్పూన్స్, మిరియాలు – ఒక టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు – 10, ఎండుమిర్చి – 15, నల్ల నువ్వులు – ఒక టీ స్పూన్, ఇంగువ – రెండు చిటికెలు, ఉప్పు – తగినంత.
ఊతప్పం తయారీ విధానం..
ముందుగా మినపప్పు, బియ్యం, అటుకులు, మెంతులను నానబెట్టి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకుని పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పిండిపై మూత పెట్టి 12 గంటల పాటు పిండిని పులియబెట్టుకోవాలి. పిండి చక్కగా పులిసిన తరువాత ఇందులో ఉప్పు, వంటసోడాను నీటిలో కరిగించి వేసుకుని కలపాలి. తరువాత కళాయిలో ఉప్పు తప్ప కారం పొడికి కావల్సిన పదార్థాలను వేసి దోరగా వేయించాలి. తరువాత ఈ దినుసులను జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పెద్ద గుంత గంటెతో పిండిని తీసుకుని పెనం మీద ఊతప్పంలా వేసుకోవాలి.
తరువాత దీనిపై రెండు టీ స్పూన్ల ఉల్లిపాయ తరుగు, ఒక టీ స్పూన్ క్యారెట్ తురుము, ఒక పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, మిక్సీ పట్టుకున్న కారం పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేసుకోవాలి. తరువాత ఊతప్పం మధ్యలో అలాగే ఊతప్పం అంచుల వెంబడి నూనె వేసుకుని దానిపై మూత పెట్టాలి. ఈ ఊతప్పాన్ని 15 నిమిషాల పాటు చిన్న మంటపై కాల్చుకున్న తరువాత మరో వైపుకు తిప్పుకోవాలి. తరువాత దీనిపై మరో టీ స్పూన్ నూనె వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఊతప్పం తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.