Bread Badusha : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో బాదుషా ఒకటి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, మెత్తగా ఉంటుంది ఈ బాదుషా. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ బాదుషాను మనం బ్రెడ్ తో కూడా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ ను ఉపయోగించి చేసే ఈ బాదుషా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. బ్రెడ్ తో బాదుషాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ బాదుషా తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 6, పంచదార – 200 గ్రా., మైదాపిండి – 100 గ్రా., వంటసోడా – అర టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బ్రెడ్ బాదుషా తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ ను తీసుకుని వాటికి ఉండే నల్లటి అంచులను తీసివేయాలి. తరువాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి. తరువాత ఈ బ్రెడ్ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మైదాపిండి, వంటసోడా వేసి కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీటిని పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో పంచదార, ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత మరో 20 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత దానిలో నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బాదుషా ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక బాదుషాలను వేసి వేయించాలి. వీటిని నూనెలో వేసిన వెంటనే కదిలించకూడదు. బాదుషా వేగి పైకి తేలిన తరువాత అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత వీటిని తీసి పంచదార పాకంలో వేసి 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ బాదుషా తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే ఈ బ్రెడ్ బాదుషాను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.