Aloo Matar Masala : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే వంటకాలతో పాటు కింద చెప్పిన విధంగా చేసిన ఆలూ బఠాణీ మసాలా కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను చేయడం కూడా చాలా తేలిక. వంటరాని వారు, బ్యాచిలర్స్ ఎవరైనా ఈ కూరను తేలికగా తయారు చేసుకోవచ్చు. చపాతీ వంటి వాటితో కలిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ఆలూ బఠాణీ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ బఠాణీ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – పావు కిలో, ఉడికించిన పచ్చి బఠాణీ – అర కప్పు, తరిగిన టమాటాలు – 2, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ.
మసాలా దినుసులు..
దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 2, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి – రెండు ఇంచుల ముక్క.
ఆలూ బఠాణీ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా జార్ లో మసాలా దినుసులు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత అల్లం పేస్ట్, టమాట ముక్కలు వేసి కలిపి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఉడికించిన బఠాణీలను, ఉడికించిన బంగాళాదుంపలను ముక్కలుగా చేసి కలపాలి.
తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర, కరివేపాకు వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బఠాణీ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని చపాతీ, పుల్కా, రోటీ, బిర్యానీ, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మసాలా కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.