Flaxseeds Powder For High BP : మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు సమస్య కూడా ఒకటి. ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. రక్తనాళాలు ముడుచుకునే గుణం ఎక్కువయ్యి సాగే గుణం తక్కువవ్వడం వల్ల రక్తపోటు సమస్య తలెత్తుతుంది. అధిక బరువు, ఉప్పును ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం, మద్యపాన సేవనం, కాఫీ ఎక్కువగా తాగడం, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని ఈ సమస్య తలెత్తడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ బీపీ కారణంగా అనేక రకాల గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తూ ఉంటాయి. బీపీని సైలెంట్ కిల్లర్ గా నిపుణులు అభివర్ణిస్తూ ఉంటారు. ఈ సమస్య బారిన పడిన వారు జీవితాంతం మందులు ఉపయోగించాల్సి ఉంటుంది.
మందులు వాడినప్పటికి కొందరిలో బీపీ అదుపులో ఉండదు. అలాంటి వారు మందులతో పాటుగా అవిసె గింజలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజలు రక్తనాళాల్లో ముడుచుకునే గుణాన్ని తగ్గించి సాగే గుణాన్ని పెంచడంలో చక్కగా ఉపయోగపడతాయని కెనడా దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. 100 గ్రాముల అవిసె గింజల్లో 13 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, 26 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అలాగే వీటిలో లిగ్నాన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో మార్పును తీసుకువచ్చి సాగే గుణాన్ని పెంచుతున్నాయి.
దీంతో రక్తనాళాలు సాగి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తద్వారా రక్తపోటు అదుపులోకి వస్తుంది. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది. రోజుకు 30 గ్రాముల అవిసె గింజలను తినడం వల్ల రక్తనాళాల్లో మార్పు వచ్చి రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. ఈ అవిసె గింజలను దోరగా వేయించి లేదా వాటితో కారం పొడిని తయారు చేసుకుని తినవచ్చు. అలాగే వీటిని పొడిగా చేసి సలాడ్స్, కూరల్లో వేసుకుని తినవచ్చు. అవిసె గింజలతో ఖర్జూరాలను కలిపి ఉండలుగా చేసుకుని కూడా ఆహారంగా తీసుకోవచ్చు.
అలాగే అవిసె గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోనాలను కూడా పొందవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, చర్మాన్ని మరియు జుట్టును సంరక్షించడంలో కూడా ఈ అవిసె గింజలు మనకు దోహదపడతాయి. ఈ విధంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు రోజూ ఆహారంలో భాగంగా అవిసె గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.