Gutti Vankaya Vepudu : గుత్తి వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. గుత్తి వంకాయలతో చేసే కూరలను అందరూ లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. వీటితో ఎక్కువగా మనం మసాలా కూరలను తయారు చేస్తూ ఉంటాం. కేవలం మసాలా కూరలే కాకుండా వీటితో మనం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా తయారు చేసుకోవచ్చు. కారం పొడి వేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుత్తి వంకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
నాలుగు పచ్చాలుగా తరిగిన గుత్తి వంకాయలు – అర కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 10 లేదా తగినన్ని, అల్లం – అర ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, జీలకర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, చింతపండు – రెండు రెబ్బలు.
గుత్తి వంకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు, శనగపప్పు, ధనియాలు వేసి దోరగా వేయించాలి. పల్లీలు చక్కగా వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఎండుమిర్చి, అల్లం, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వేయించిన ఈ దినుసులన్నింటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, చింతపండు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఈ కారం పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ కారం పొడిని కట్ చేసుకున్న వంకాయల్లో నిండుగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయలను నూనెలో వేయాలి.
తరువాత వీటిపై మూత పెట్టి వంకాయలను వేయించాలి. వంకాయలు ఒక వైపు వేగిన తరువాత వాటిని మరో వైపుకు తిప్పి వేయించాలి. ఇలా వంకాయలు పూర్తిగా వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిగిలిన కారం పొడిని కూడా వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వేపుడు ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. గుత్తివంకాయలతో తరచూ మసాలా కూరలే కాకుండా అప్పుడప్పుడూ ఇలా కారం పొడి కూడా వేసి తయారు చేసుకోవచ్చు.