Cashew Nuts : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు కూడా ఒకటి. జీడిపప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని వంటల్లో వాడడంతో పాటు నానబెట్టుకుని తింటూ ఉంటాం. ఇతర డ్రై ఫ్రూట్స్ వలె జీడిపప్పు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది జీడిపప్పును తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని, గుండె జబ్బులు వస్తాయని, శరీరంలో వాతం చేస్తుందని దీనిని తీసుకోవడం తగ్గిస్తున్నారు. అసలు జీడిపప్పు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుందా లేదా అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపప్పులో కొవ్వులు, ప్రోటీన్, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.
వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పును తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా ఇవి మనకు సహాయపడతాయి. జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు జీడిపప్పును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జీడిపప్పును తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కవు సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మనం చాలా సలుభంగా బరువు తగ్గవచ్చు. అలాగే జీడిపప్పులో కార్బోహైడ్రేట్స్ ఉండవు కనుక వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
అదే విధంగా జీడిపప్పులో ఆన్ స్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మాంసానికి సమానంగా జీడిపప్పులో ప్రోటీన్ ఉంటుంది. కనుక జీడిపప్పును తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. జీడిపప్పును తీసుకోవడం వల్ల బుద్ది కుశలత పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. అలాగే టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు తగిన మోతాదులో జీడిపప్పును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండడంతో పాటు నీరసం కూడా తగ్గుతుంది. అదే విధంగా చర్మం మరియు జుట్టు సంరక్షణలో కూడా జీడిపప్పు మనకు సహాయపడుతుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. జీడిపప్పులో కొవ్వు ఉన్నప్పటికి అది మన ఆరోగ్యానికి మేలు చేసేదే అని నిపుణులు చెబుతున్నారు.
అయితే చాలా మంది వీటిని నూనెలో, నెయ్యితో వేయించి ఉప్పు, కారం వేసి తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల రుచిగా ఉన్నప్పటికి మేలు చేసే కొవ్వు అనారోగ్యానికి దారి తీస్తుంది. అలాగే వేయించడం వల్ల దీనిలో ఉండే పోషకాలు దెబ్బతింటాయి. వేయించిన జీడిపప్పును తీసుకోవడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ జీడిపప్పును నానబెట్టుకుని తినడం వల్ల దీనిలో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయని అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు.