Bladder Cancer Symptoms : మన శరీరంలో ఉండే సున్నితమైన అవయవాల్లో మూత్రాశయం కూడా ఒకటి. సున్నిమైన కండరాలతో నిర్మితమైన ఈ మూత్రాశయం త్రిభుజాకారంలో ఉంటుంది. మూత్రాశయంలో మూత్రం నిల్వం ఉంటుంది. మూత్రం నిల్వ చేసేటప్పుడు దీని గోడలు వ్యాకోచిస్తాయి. అలాగే మూత్రనాళం ద్వారా మూత్రం విసర్జించబడిన తరువాత మూత్రాశయం సంకోచిస్తుంది. మూత్రపిండాలతో పాటు మూత్రాశయం కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కానీ ప్రస్తుత కాలంలో మారిన మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది మూత్రాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు.
2018 లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడిన వారు 5, 49,000 మందిగా గుర్తించారు. అలాగే మన భారత దేశంలో 18, 921 మంది ఈ ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారిన పడినట్టు లెక్కలు చెబుతున్నాయి. మొదటగా ఈ క్యాన్సర్ మూత్రాశయ గోడల్లో ఉండే కణాల్లో మొదలవుతుంది. క్రమంగా ఈ కణాలు నియంత్రణ లేకుండా పెరగడం ప్రారంభించినప్పుడు మూత్రాశయ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ఈ క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాంతకంగా మారకుండా ఉంటుంది. మూత్రాశయ క్యాన్సర్ వ్యాధిలో కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాధి బారిన పడినప్పుడు ముందుగా మూత్రంలో రక్తం వస్తుంది.
అలాగే మూత్రవిసర్జన చేసేటప్పుడు తీవ్రమైన నొప్పి , మంట కలుగుతుంది. అలాగే తరచూ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో మరీ ఎక్కువగా మూత్ర విసర్జనుకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే మూత్రం వస్తున్నట్టుగా ఉంటుంది కానీ మూత్ర విసర్జనకు చేయకపోవడం వంటి వాటిని కూడా ఈ క్యాన్సర్ యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. అలాగే వీపు కింద భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. అలాగే క్యాన్సర్ నిర్దారణ చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ లక్షణాలు క్యాన్సర్ కు దారి తీయకపోవచ్చు. కనుక లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మూత్రాశయ క్యాన్సర్ ను ముందుగా గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాంతకంగా మారకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.