Tomato Pappu Charu : మనం వంటింట్లో విరివిరిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటాలు ఒకటి. టమాటాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల చక్కటి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. టమాటాలతో మనం ఎక్కువగా పప్పు, పచ్చళ్లు, కూరలు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా టమాటాలతో మనం ఎంతో రుచిగా ఉండే టమాట పప్పు చారును కూడా తయారు చేసుకోవచ్చు. టమాటాలతో చేసే ఈ పప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ టమాట పప్పు చారును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పప్పు చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – 50 గ్రా., పెసర పప్పు – 50 గ్రా., పొడుగ్గా తరిగిన టమాటాలు – 6, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 6, మెంతి పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, స్టోన్ ప్లవర్ – ఒక టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్,ఉప్పు – తగినంత, ఎండుమిర్చి – 2.
టమాట పప్పు చారు తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కందిపప్పు, పెసరపప్పు వేసి వేయించాలి. పప్పు దోరగా వేగిన తరువాత అందులో ఒక గ్లాస్ నీళ్లు, పసుపు, ఉప్పు వేయాలి. తరువాత దానిపై మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత కళాయిలో టమాట ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాట ముక్కలు ఆరిన తరువాత అందులో అర గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా చేత్తో నలిపి పిప్పిని తీసేయాలి.
మిగిలిన టమాట గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి మిశ్రమం, పొడుగ్గా తరిగిన టమాట ముక్కలు వేసి వేయించాలి. టటమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత ధనియాల పొడి, మెంతి పొడి వేసి కలపాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న టమాట గుజ్జు, ఉడికించిన పప్పు వేసి కలపాలి. తరువాత ఒక లీటర్ నీళ్లు, ఉప్పు వేసి కలపాలి.
తరువాత ఈ పప్పు చారును పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన తరువాత స్టోన్ ప్లవర్ వేసి మరో పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన తరువాత తరిగిన కొత్తిమార వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పప్పు చారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. టమాటాలతో తచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా టమాట పప్పు చారును కూడా తయారు చేసుకుని తినవచ్చు.