Thotakura Pakoda : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో తోటకూర ఒకటి. తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. తోటకూరతో మనం ఎక్కువగా వేపుడు, కూర, పప్పు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా తోటకూరతో మనం ఎంతో రుచిగా ఉండే పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చు. తోటకూర పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఎవరైనా కూడా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా తోటకూర పకోడీలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర పకోడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తోటకూర – ఒక పెద్ద కట్ట, శనగపప్పు – ఒకటిన్నర కప్పు, బియ్యం పిండి – అర కప్పు, ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి – 6, పసుపు – పావు టీ స్పూన్, వేడి నూనె – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
తోటకూర పకోడీ తయారీ విధానం..
ముందుగా తోటకూరను కాడలు లేకుండా తరగాలి. తరువాత దానిని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, శనగపిండి, బియ్యం పిండి, వేడి నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని పకోడీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినంత పిండిని తీసుకుని పకోడీలా వేసుకోవాలి. ఈ పకోడీలను కలుపుతూ మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర పకోడీలు తయారవుతాయి. సాయంత్రం సమయంలో స్నాక్స్ గా ఈ పకోడీలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పకోడీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తోటకూరతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పకోడీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.