మైక్రో ఎస్‌డీ కార్డ్స్… స్మార్ట్‌ఫోన్లు మొదటి సారిగా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వాటిలో ఈ కార్డులు ఉంటున్నాయి. వీటి వల్ల మనకు ఫోన్లలో, ఆయా డివైస్‌లలో స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. అయితే కొన్ని రకాల ఫీచర్ ఫోన్లలోనూ మెమొరీ కార్డులు వేసుకునే విధంగా ఆప్షన్స్ ఇస్తున్నారు. అది వేరే విషయం. అయితే ఒకప్పటి కన్నా ఇప్పుడు మెమొరీ కార్డులలో మనకు లభించే సైజ్ పెరిగింది. ఒకప్పుడు 1జీబీ, 2 జీబీ కార్డులు ఉంటే గొప్ప. కానీ ఇప్పుడు అలా కాదు. ఏకంగా 256 జీబీ వరకు సైజ్ గల కార్డులు మనకు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే మీకు తెలుసా..? మెమొరీ కార్డులపై 2, 4, 6, 10 అని అంకెలు ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయో, వాటి వల్ల మనకు ఏం తెలుస్తుందో ఇప్పుడు చూద్దాం.
మెమోరీ కార్డులపై ఉండే 2, 4, 6, 10 అనే అంకెలు వాటి క్లాస్‌ను సూచిస్తాయి. అంటే క్లాస్ అంకె ఎంత ఎక్కువ ఉంటే ఆ కార్డు అంత స్పీడ్‌గా పనిచేస్తుందని అర్థం. క్లాస్ 2 అని ఉన్న కార్డు కన్నా క్లాస్ 10 అని ఉన్న కార్డు ఎక్కువ వేగంతో డేటాను రీడ్, రైట్ చేస్తుందని అర్థం. అంటే… క్లాస్ 10 అని ఉన్న మెమోరీ కార్డులను ఏ ఫోన్‌లో వేసినా బాగా వేగంగా డేటాను కాపీ చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏయే క్లాస్ మెమొరీ కార్డులు ఎంత వేగంతో డేటాను రీడ్, రైట్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. క్లాస్ 2 కార్డులు… ఈ కార్డుల్లో 2 ఎంబీ పర్ సెకండ్ స్పీడ్‌తో డేటాను రీడ్, రైట్ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ స్పీడ్. పూర్వం వచ్చిన కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేసేవి. కానీ ఇప్పుడు ఆ స్పీడ్‌తో కార్డులు చాలా తక్కువగా లభిస్తున్నాయనే చెప్పవచ్చు. సాధారణంగా 1 జీబీ, 2 జీబీ, 4జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేస్తాయి.
క్లాస్ 4 కార్డులు… సెకనుకు 4 ఎంబీ స్పీడ్‌తో వీటిలో డేటాను రీడ్, రైట్ చేసుకోవచ్చు. ఎక్కువగా 4జీబీ, 8 జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేస్తాయి. క్లాస్ 6 కార్డులు… ఈ కార్డుల్లో 6 ఎంబీ పర్ సెకండ్ స్పీడ్‌తో డేటాను రీడ్, రైట్ చేసుకోవచ్చు. సాధారణంగా 4జీబీ, 8 జీబీ, 16 జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేస్తాయి. క్లాస్ 10 కార్డులు… వీటి ద్వారా సెకనుకు 10 ఎంబీ ఆపైన స్పీడ్‌తో డేటాను రీడ్, రైట్ చేసుకోవచ్చు. కొన్ని కార్డుల్లో గరిష్టంగా 60 ఎంబీ పర్ సెకండ్ స్పీడ్ కూడా మనకు లభిస్తోంది. ఎక్కువగా 8 జీబీ, 16 జీబీ, 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ సైజ్ ఉన్న కార్డులు ఈ స్పీడ్‌తో పనిచేస్తాయి.