Summer Heat : ఎండాకాలం రానే వచ్చింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా మనం ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే వడదెబ్బ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంది. కనుక మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వేసవి కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వేసవికాలంలో తరచూ నీటిని తాగుతూ ఉండాలి. వీలైనంత ఎక్కువగా నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. అలాగే ఒ ఆర్ ఎస్ ద్రావణాన్ని తాగాలి. బయట లభించే శీతల పానీయాలకు బదులుగా ఇంట్లోనే నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, లస్సీ, ఫ్రూట్ జ్యూస్ వంటి వాటిని తయారు చేసుకుని అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుని తాగాలి.
అలాగే వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఉండే ప్రయత్నం చేయాలి. ఉదయం, సాయంత్రం సమయంలో బయట పనులను ఎక్కువగా చేసుకోవాలి. ఒకవేళ ఎండలో తిరగాల్సి వస్తే గొడుగును ఉపయోగించాలి. తలకు నేరుగా ఎండ తగలకుండా టోపి, టవల్, రుమాలు వంటి వాటిని ఉపయోగించాలి. అలాగే ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రత వివరాలను తెలుసుకుంటూ ఉండాలి. అలాగే ఇంట్లో వీలైనంత వరకు చల్లగా ఉండేలా చూసుకోవాలి. పగటిపూట కిటికీలను, తలుపులను మూసేసి రాత్రి పూట వాటిని తెరిచి ఉంచాలి. అదే విధంగా పలుచగా, వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించాలి. అలాగే ముదురు రంగు వస్త్రాలను ధరించకుండా ఉండాలి. అలాగే చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఆరు బయట ఎక్కువగా పని చేసే వారు, మానసిక వ్యాధి గ్రస్తులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే వారు వేసవికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చల్లటి ప్రదేశం నుండి వేడి ప్రదేశానికి వచ్చే వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
వారు వేడికి అలవాటు పడడానికి సమయం పడుతుంది. అలాంటి వారు నీటిని ఎక్కువగా తాగాలి. కొద్ది కొద్దిగా వేడి వాతావరణంలో పనులు చేసే సమయాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వారు వేడి వాతావరణానికి త్వరగా అలవాటు పడవచ్చు. అలాగే వేడి తీవ్రంగా ఉండే సమయంలో అనగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండాలి. అదే విధంగా ఎండ ఎక్కువగా సమయంలో వంట చేయకూడదు. ముందుగానే ఆహారాన్ని సిద్దం చేసుకుని ఉంచాలి. అలాగే వంట చేసే సమయంలో గాలి ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి. అలాగే ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు వంటి వాటిని తాగకూడదు. ఇవి శరీరం నుండి నీరు ఎక్కువగా బయటకు వెళ్లేలా చేస్తాయి. కనుక వాటిని వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. అలాగే ఎక్కువ ప్రోటీన్ కలిగిన మరియు ఉప్పు కలిగిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి.
అలాగే విండోస్, డోర్స్ మూసేసి ఎండలో పార్క్ చేసి ఉంచిన వాహనాల్లో పిల్లలను వదిలి వెళ్లవద్దు. ఎండ కారణంగా వారు తీవ్ర అస్వస్థకు గురి అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా తల తిరగడం, వాంతులు, తలనొప్పి, తీవ్రమైన దాహం, మూత్రంముదురు పసుపు రంగులో రావడం, మూత్రం తక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వేసవి కాలంలో ఎండ నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.