Paneer Mushroom Dum Biryani : పనీర్ ధమ్ బిర్యానీ.. ఇది మనకు రెస్టారెంట్ లలో ఎక్కువగా లభిస్తుంది. పనీర్ తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. కేవలం పనీర్ తోనే కాకుండా ఇందులో మష్రూమ్ వేసి ఎంతో రుచిగా ఉండే దమ్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. పనీర్ మష్రూమ్ వేసి చేసే ఈ దమ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు ఎవరైనా ఈ బిర్యానీని సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా ఉండడంతో పాటు సులభంగా అయ్యే ఈ పనీర్ మష్రూమ్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ మష్రూమ్ దమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఫ్రైడ్ ఆనియన్స్ – అర కప్పు, మష్రూమ్ – పావుకిలో, పనీర్ – పావుకిలో, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, నూనె – 3 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పెరుగు – ఒక కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 3, జీడిపప్పు పలుకులు – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా – అర టీ స్పూన్.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – రెండు లీటర్లు, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 3, బిర్యానీ ఆకులు – 2, అనాస పువ్వులు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, అర గంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నెయ్యి – ఒక టీ స్పూన్.
పనీర్ మష్రూమ్ దమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత పెరుగు వేసి కలపాలి. తరువాత దీనిని నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత మష్రూమ్ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మష్రూమ్ ను ఉడికించాలి. మష్రూమ్ సగానికి పైగా ఉడికిన తరువాత పనీర్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలపాలి.
పనీర్ ముక్కలు కూడా ఉడికిన తరువాత జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, పావు కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో నీటిని తీసుకోవాలి. ఇందులో బియ్యం తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని 80 శాతం వరకు ఉడికించిన తరువాత వడకట్టుకుని ముందుగా ఉడికించిన కూర మీద సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు అన్నంపై కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక టీ స్పూన్ నెయ్యి, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టాలి.
దీనిని చిన్న మంటపై 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని కదిలించకుండా 20 నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ మష్రూమ్ దమ్ బిర్యానీ తయారవుతుంది. దీనిని రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా పనీర్ మష్రూమ్ దమ్ బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.