Chitlam Podi : మనం వంటింట్లో రకరకాల కారం పొడులను తయారు చేస్తూ ఉంటాం. కారం పొడులు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మనం చాలా సులభంగా తయారు చేసుకోదగిన కారం పొడులల్లో చిట్లం పొడి కూడా ఒకటి. రాయలసీమ స్పెషల్ వంటకాల్లో చిట్లం పొడి కూడా ఒకటి. టిఫిన్స్ తో పాటు అన్నంతో తినడానికి కూడా ఈ పొడి చాలా రుచిగా ఉంటుంది. ఈ చిట్లం పొడిని మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే చిట్లం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిట్లం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – పావు కప్పు, మినపప్పు – పావు కప్పు, కందిపప్పు – పావు కప్పు, ఎండుమిర్చి – 25, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, చింతపండు – గోళి అంత, ఉప్పు – తగినంత.
చిట్లం పొడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో శనగపప్పు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే మినపప్పు కూడా వేసి వేయించాలి. వీటిని కూడా ఎర్రగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కందిపప్పు కూడా వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి. ఎండుమిర్చి ఎర్రగా చక్కగా కాలిన తరువాత దీనిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో జీలకర్ర, మిరియాలు వేసి వేయించాలి. ఇవి సగానికి పైగా వేగిన తరువాత చింతపండు కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తరువాత ముందుగా జార్ లో ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత వేయించిన పప్పు దినుసులు, జీలకర్ర, మిరియాలు వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చిట్లం పొడి తయారవుతుంది. దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఈ పొడిని ఇడ్లీ, దోశ వంటి వాటిపై చల్లుకుని నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని వేడి వేడి అన్నం నెయ్యితో కూడా కలిపి తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన చిట్లం పొడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.