Diabetes Symptoms : మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. షుగర్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. చాలా మంది తీపి ఎక్కువగా తినే వారికే షుగర్ వ్యాధి వస్తుందని భావిస్తూ ఉంటారు. కానీ ఈ వ్యాధి ఎవరికైనా రావచ్చు. చాలా మంది షుగర్ వ్యాధి మనకు రాదులే అని పరీక్షలు చేయించుకోకుండా దీనిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ షుగర్ వ్యాధిని గుర్తించకుండా దీనిని నిర్లక్ష్యం చేసే కొద్ది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
మన ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది కనుక ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. షుగర్ వ్యాధిని మనం కొన్ని లక్షణాల ద్వారా మనం ముందుగానే గుర్తించవచ్చు. షుగర్ వ్యాధి కారణంగా మన శరీరంలో కనబడే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వ్యాధి ఉన్న వారిలో పదే పదే ఆకలి వేస్తుంది. భోజనం చేసిన తరువాత కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఈ లక్షణం కనిపించిన వెంటనే తీపి పదార్థాలను, కూల్ డ్రింక్స్ ను, పంచదారను తీసుకోవడం తగ్గించాలి. అలాగే ఉదయం లేచిన వెంటనే చాలా నీరసంగా ఉండడం రోజంతా కూడా నీరసంగా ఉండడాన్ని కూడా షుగర్ వ్యాధి లక్షణంగా చెప్పవచ్చు.
అలాగే తరచూ మూత్రవిసర్జన కూడా షుగర్ వ్యాధి లక్షణంగా చెప్పవచ్చు. ఈ లక్షణం కనిపించిన వెంటనే ఐస్ క్రీమ్ ను, చాక్లెట్స్ ను తీసుకోవడం తగ్గించాలి. అదే విధంగా తరచూ దాహం వేస్తున్న, గొంతు ఎండిపోతున్నా కూడా షుగర్ వ్యాధి లక్షణంగా గుర్తించాలి. అలాగే ఎంతటి క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నప్పటికి మనం బరువు తగ్గిపోతూ ఉంటాం. షుగర్ వ్యాధి గ్రస్తుల్లో కనిపించే లక్షణాల్లో ఇది ఒకటి. అలాగే యూరీనరి ట్రాక్ ఇన్ఫెక్షన్ లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్ లు రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవారిలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే పంచదారను తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. అలాగే చర్మం ఎక్కువగా పొడిబారిపోతున్నా కూడా షుగర్ వ్యాధి లక్షణంగా భావించాలి.
శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల మనం దేనిపైనా శ్రద్ధ పెట్టలేకపోతుంటాము. ఆలోచనా శక్తి కూడా తగ్గుతుంది. అదే విధంగా కంటిచూపు కూడా తగ్గుతుంది. గాయాలు, దెబ్బలు త్వరగా మానవు. పురుషుల్లో లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుంది. తరచూ కోపం, చిరాకు, ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఈ లక్షణాలను బట్టి మన శరీరంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నయని గుర్తించాలి. వెంటనే తీపి పదార్థాలను తీసుకోవడం మానేసి వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.