Pesara Pappu Sambar : మనం వంటింట్లో తరచూ సాంబార్ ను తయారు చేస్తూ ఉంటాం. సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది సాంబార్ ను ఇష్టంగా తింటారు. సాంబార్ ను అన్నం, ఇడ్లీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మనం సాధారణంగా ఈ సాంబార్ ను కందిపప్పుతో తయారు చేస్తూ ఉంటాం. కేవలం కందిపప్పుతోనే కాకుండా మనం పెసరపప్పుతో కూడా సాంబార్ ను తయారు చేసుకోవచ్చు. పెసరపప్పుతో చేసే సాంబార్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, కమ్మగా ఉండే ఈ సాంబార్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసరపప్పు సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – 100 గ్రా., తరిగిన క్యారెట్ – 1, సొరకాయ ముక్కలు – ఒక కప్పు, పొడుగ్గా తరిగిన టమాటా – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, ఇంగువ – చిటికెడు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పెసరపప్పు సాంబార్ తయారీ విధానం..
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూతను ఉంచాలి. ఈ పప్పును 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులోనే కూరగాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ఒక లీటర్ నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు ఈ సాంబార్ ను మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత చింతపండు రసం వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని సాంబార్ లో వేసి కలపాలి. ఇందులోనే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు సాంబార్ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ కందిపప్పుతోనే కాకుండా అప్పుడప్పుడూ ఇలా పెసరపప్పుతో కూడా సాంబార్ ను తయారు చేసుకుని తినవచ్చు.