Pigmentation : పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్.. ప్రస్తుత కాలంలో ఇటువంటి చర్మ సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. స్త్రీ, పురుషులు అలాగే వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమ్య బారిన పడుతూ ఉంటారు. వయసు పైబడడం, రసాయనాలు కలిగిన సౌందర్య సాధనాలను వాడడం, హార్మోన్ల అసమతుల్యత, ఎండలో ఎక్కువగా తిరగడం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం, మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వంటి వివిధ కారణాల చర్మం మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ మచ్చలు మరీ ఎక్కువగా ఉంటే దీనినే హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు. ఈ మచ్చల కారణంగా ముఖం అందవిహీనంగా కనబడుతుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు.
బయట దొరికే అనేక రకాల క్రీములను, ఫేస్ ప్యాక్ లను వాడుతూ ఉంటారు. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో స్క్రబర్ ని అలాగే ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా ఈ మచ్చలను తొలగించుకోవచ్చు. ముఖంపై ఉండే మచ్చలను తొలగించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనం పంచదారను, నిమ్మరసాన్ని, పెరుగును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా పెరుగును మన ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ ఆరిన తరువాత నిమ్మచెక్కతో పంచదారను తీసుకుని ముఖంపై రుద్దుకోవాలి. నిమ్మరసాన్ని పిండుతూ చర్మాన్ని స్క్రబ్ చేసుకోవాలి. ఇలా రెండు నుండి మూడు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకున్న తరువాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈవిధంగా ఈ చిట్కాను వాడడం వల్ల మనం ముఖంపై ఉండే మచ్చలను చాలా సులభంగా తొలగించుకోవచ్చు. అలాగే పిగ్మెంటేషన్ తగ్గించే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక స్పూన్ చందనం పొడిని, బంగాళాదుంప రసాన్ని, చిటికెడు పసుపును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా గిన్నెలో చందనం పొడిని తీసుకోవాలి. తరువాత ఇందులో పసుపు వేసి కలపాలి. ఇప్పుడు తగినంత బంగాళాదుంప రసాన్ని పోస్తూ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మచ్చలు తగ్గుతాయి. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి. ఈ చిట్కాలను వాడినప్పటికి మచ్చలు తగ్గు ముఖం పట్టకపోతే వైద్యున్ని సంప్రదించాలి.