Masala Tea Powder : మనలో చాలా మంది టీ ని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. రోజుకు 5 నుండి6 సార్లు టీ తాగే వారు కూడా ఉన్నారు. ఒత్తిడి, ఆందోళన వంటి వాటితో బాధపడుతున్నప్పుడు, అలసటకు గురి అయినప్పుడు టీ ని తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. టీ తాగడం వల్ల శరీర బడలిక తగ్గుతుంది. మెదడుకు, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే మనం మనకు నచ్చిన రీతిలో ఈ టీ ని తయారు చేసుకుని తాగుతూ ఉంటాం. మనం సులభంగా చేసుకోదగిన టీ వెరైటీలలో మసాలా టీ కూడా ఒకటి. మసాలా టీ చాలా రుచిగా ఉంటుంది. మనకు ఎక్కువగా టీ దుకాణాల్లో, రెస్టారెంట్ లలో, హోటల్స్ లో ఈ టీ లభిస్తూ ఉంటుంది. మసాలా దినుసులను పొడిగా చేసి ఆ పొడితో ఈ టీ ని తయారు చేస్తారు. ఈ టీ ని తాగడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. చక్కటి రుచిని, వాసన కలిగి ఉండే మసాలా టీ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా టీ పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
యాలకులు – ఒక టేబుల్ స్పూన్, లవంగాలు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, నల్ల యాలక్కాయలు – 4, సోంపు – ఒక టీ స్పూన్, జాపత్రి – 2, శొంఠి – 50 గ్రా., దాల్చిన చెక్క – 2 ఇంచు ముక్కలు, వేయించిన జాజికాయ పొడి – ఒక టీ స్పూన్.
మసాలా టీ పౌడర్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో యాలకులు, లవంగాలు, మిరియాలు, నల్ల యాలకులు, సోంపు వేసి చిన్న మంటపై 4 నుండి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత శొంఠి, దాల్చిన చెక్క వేసి మరో 4 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే జాజికాయ పొడి కూడా వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా టీ పౌడర్ తయారవుతుంది. దీనిని మూత ఉండే గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని టీ పౌడర్ వేసేటప్పుడే అర టీ స్పూన్ మోతాదులో వేయాలి. అర టీ స్పూన్ పొడితో 2 నుండి 3 కప్పుల టీని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మసాలా పొడితో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.