Foods In Plastic : మనకు ఇంట్లో ఆహారం తయారు చేసుకోవడం వీలు కానప్పుడు మనం సాధారణంగా ఆహారాన్ని బయట నుండి తెచ్చుకుంటూ ఉంటాం. కర్రీ పాయింట్ ల దగ్గర నుండి, రెస్టారెంట్ ల దగ్గర నుండి ఆహారాన్ని ఫ్యాక్ చేసుకుని తెచ్చుకుంటూ ఉంటాం. అలాగే ఆహారాన్ని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటూ ఉంటాం. అయితే ఆహారాన్ని ప్యాక్ చేసే క్రమంలో ఎక్కువ సిల్వర్ పాయిల్ లను, ప్లాస్టిక్ కవర్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే అల్యూమినియం టిన్ లలో మనకు కొన్ని రకాల ఫ్రూట్ జ్యూస్ లు, కూల్ డ్రింక్స్ కూడా లభిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని రకాల ఆహారాలను సిల్వర్ పాయిల్ లల్లో చుట్టి ఇస్తూ ఉంటారు. ఇలా వివిధ రూపాల్లో మనం ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్ లలో ప్యాక్ చేస్తూ ఉంటాం.
ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఇలా అల్యూమినియం ఫాయిల్ ను, ప్లాస్టిక్ కవర్ ను, టెట్రా ప్యాక్ ను ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎంతో హాని కలుగుతుంది. ప్లాస్టిక్ తయారీలో బిపిఎ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. అయితే ఫ్రభుత్వం నిర్దేశించిన దాని కంటే ఎక్కువ మొత్తంలో ఈ బిపిఎ ను ప్లాస్టిక్ తయారీలో వాడుతున్నారు. ప్లాస్టిక్ కవర్ లో వేడి పదార్థాలను వేసినప్పుడు ఇందులో ఉండే బిపిఎ కరిగి ఆహారంలో కలుస్తుంది. బిపిఎ క్యాన్సర్ కారకం. ఇది ఎక్కువగా మెదడు పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దీని వల్ల మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే హార్మోన్లను ఉత్పత్తి చేసే అవయవాలపై కూడా ఈ బిపిఎ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
దీంతో పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడం, వాటి నాణ్యత తగ్గడం వంటి చెడు ఫలితాలు కలుగుతాయి. అలాగే బిపిఎ అనే రసాయనం కారణంగా స్త్రీలల్లో హార్మోన్ల అసమతుల్యత వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన లేమి సమస్యలు తలెత్తడానికి కూడా ప్రధాన కారణం ఈ బిపిఎ అని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా టెట్రా ప్యాక్ లలో నిల్వ ఉంచిన ఆహారాలను తీసుకోవడం వల్ల, ప్లాస్టిక్ కవర్ లలో నిల్వ ఉంచిన ఆహారాలను తీసుకోవడం వల్ల తలనొప్పి, హార్మోన్ల అసమతుల్యత, గుండె కొట్టుకోవడంలో తేడా రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే అల్యూమినియం టిన్ లలో నిల్వ చేసిన కూల్ డ్రింక్స్ ను తాగడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అల్యూమినియం టిన్ ల తయారీలో పాలీ ఇథిలిన్, టెరిఫ్తిలిన్ అనే రసాయనాలను వాడుతూ ఉంటారు. ఇలా అల్యూమినియం టిన్ లలో నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల చిరన్న వయసులోనే అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కనుక వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసి ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ ను తక్కువగా ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.