Mutton Masala Gravy : నాన్ వెజ్ వంటకాల్లో మటన్‌కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దీంతో అనేక రకాల వెరైటీలను చేస్తుంటారు. మటన్ ఫ్రై, కూర, బిర్యానీ.. ఇలా చేస్తారు. అయితే ఫంక్షన్లలో వచ్చేలా మటన్‌ను గ్రేవీ మసాలాతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే మటన్ మసాలా గ్రేవీ కూరను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ మసాలా గ్రేవీ తయారీకి కావలసిన పదార్థాలు..
మటన్ – అరకిలో, ఉల్లిపాయ – ఒకటి, వెల్లుల్లి – చిన్న సైజు ఒక్కటి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేబుల్ స్పూన్ కారం పొడి, కొత్తిమీర, కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు, అల్లం తురుము టేబుల్ స్పూన్, లవంగాలు 4, ఎండుమిర్చి 2, ఆవాలు, జీలకర్ర అర టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మ, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు.
మటన్ మసాలా గ్రేవీ తయారీ విధానం..
ముందుగా మిక్సీ గిన్నెలో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, లవంగాలు, కొబ్బరి తురుము, అల్లం, కొత్తిమీర వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. తరువాత మటన్ శుభ్రం చేసుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తరవాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆవాలు చిటపట అన్న తరువాత మటన్ వేసి బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటు మటన్ ను నూనెలో వేయించడం వల్ల మటన్‌లో ఉన్న నీటి శాతం పోతుంది.
రెండు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. మరో రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ముందుగా తయారు చేసుకొన్న మసాలా వేయాలి. తక్కువ మంటపై మసాలాను ఒక ఐదు నిమిషాలు పాటు మగ్గనివ్వాలి. తర్వాత కారం పొడి వేసి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత తగినంత నీరు వేసి కుక్కర్ మూత పెట్టాలి. సుమారు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం వెళ్లే వరకు ఉండి తర్వాత కుక్కర్ మూత తీసి మరో రెండు నిమిషాల పాటు సిమ్ లో మటన్ ఉడికించుకుంటే మటన్ మసాలా గ్రేవీ తయారైనట్టే. దీన్ని అన్నం లేదా చపాతీలు, పూరీల్లో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు.