Aviri Kudumulu : పూర్వకాలంలో అల్పాహారంగా చేసే వంటకాల్లో ఆవిరి కుడుములు కూడా ఒకటి. మినపప్పుతో చేసే ఈ ఆవిరి కుడుములు చాలా మెత్తగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. శరీరం పుష్టిగా, గట్టిగా అవుతుంది. వారానికి కనీసం రెండు సార్లు వీటిని తప్పకుండా తీసుకోవాలి. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఆవిరి కుడుములను పూర్వకాలంలో చేసిన మాదిరి ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవిరి కుడుముల తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు మినపప్పు – 2 కప్పులు, ఉప్పు – తగినంత.
ఆవిరి కుడుముల తయారీ విధానం..
ముందుగా పప్పును గిన్నెలోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తరువాత పైన ఉండే పొట్టు పోయేలా శుభ్రంగా కడగాలి. తరువాత దీనిని జార్ లో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు గిన్నెలో సగానికి తక్కువగా నీటిని తీసుకోవాలి. తరువాత దీనిపై తడిపిన కాటన్ వస్త్రాన్ని వేసి దారంతో కట్టాలి. ఇప్పుడు కాటన్ వస్త్రంపై పిండిని కొద్దిగా పలుచగా వేసుకోవాలి. తరువాత పిండిని వస్త్రం అంచులతో మూసి వేయాలి. ఇలా మూసేసిన తరువాత దీనిపై మూత పెట్టి గిన్నెను స్టవ్ మీద ఉంచాలి.
ఈ కుడుములను మధ్యస్థ మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వస్త్రం నుండి వేరు చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆవిరి కుడుముల తయారవుతాయి. ఈ కుడుములను నెయ్యి, ధనియాల కారం పొడితో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా మినపప్పుతో ఆవిరి కుడుములను చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని, బలాన్ని పొందవచ్చు.