Rasam : మనం వంటింట్లో అప్పుడప్పుడూ రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాము. రసం చాలా రుచిగా ఉంటుంది. రసంతో తినడం వల్ల కడుపు నిండా భోజనం చేస్తారని చెప్పవచ్చు. అలాగే దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడుతున్నప్పుడు రసంతో భోజనం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బయట లభించే రసం పొడులతో కాకుండా మన ఇంట్లోనే రసం పొడిని ఎలా తయారు చేసుకోవాలి. అలాగే ఈ పొడితో రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
చింతపండు – నిమ్మకాయంత, నీళ్లు – ఒక గ్లాస్, పండిన టమాట – 1, మిరియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, మెంతులు – చిటికెడు, ఎండుమిర్చి – 10, వెల్లుల్లి రెమ్మలు – 10, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో చింతపండును తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు, టమాట కాయ వేసి పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో మిరియాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత చింతపండును, టమాటకాయను చేత్తో నలుపుతూ గుజ్జును తీయాలి. తరువాత చింతపండు తొక్కలను తీసేసి గుజ్జును పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న పొడి, పసుపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత ఉప్పు,చింతపండు మరియు టమాట రసం వేసి కలపాలి. తరువాత పులుపుకు తగినన్ని సుమారు రెండున్నర గ్లాసుల నీళ్లు పోసి కలపాలి. ఈ రసాన్ని ఒక పొంగు వచ్చే వరకు మరిగించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రసం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నోటికి ఏది తినాలనిపించనప్పుడు ఈ విధంగా రసాన్ని తయారు చేసుకుని తినవచ్చు.