Kattu Pongali : పెసరపప్పుతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కట్టు పొంగలి కూడా ఒకటి. బియ్యం, పెసరపప్పు కలిపి చేసే ఈ పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మన ఆరోగ్యానిక ఎంతో మేలు చేసే ఈ కట్టు పొంగలిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా, కమ్మగా ఉండే ఈ కట్టు పొంగలిని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కట్టు పొంగలి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక గ్లాస్, పెసరపప్పు – ఒక గ్లాస్, నీళ్లు – 8 గ్లాసులు, ఉప్పు – తగినంత, నెయ్యి – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 4, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, మిరియాల పొడి -ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
కట్టు పొంగలి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లు పోసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. బియ్యం, పెసరపప్పు పలుకులు లేకుండా మెత్తగా ఉడికిన తరువాత ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న పొంగల్ లో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కట్టు పొంగలి తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అల్పాహారంగా తీసుకోవడానికి ఈ పొంగలి చాలా చక్కగా ఉంటుంది.