Gobi Masala Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాలీ ప్లవర్ కూడా ఒకటి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. క్యాలీప్లవర్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యాలీప్లవర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో క్యాలీ ప్లవర్ మసాలా మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్యాలీప్లవర్ తో తరచూ చేసే వంటకాలతో పాటు ఎంతో రుచిగా ఉండే ఈ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాలీ ప్లవర్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాలీప్లవర్ – చిన్నది ఒకటి, నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, జీడిపప్పు – 6, తరిగిన టమాటాలు – 2, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, జీలకర్ర -అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్యాలీప్లవర్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు, పసుపు, ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత క్యాలీప్లవర్ ముక్కలు వేసి ఉడికించాలి. వీటిని 3 నిమిషాల పాటు ఉడికించిన తరువాత ముక్కలను తీసి పక్కకు ఉంచాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి వేడి చేయాలి. తరువాత ఉడికించిన క్యాలీ ప్లవర్ ముక్కలు వేసి వేయించాలి. వీటిని రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి.
ఇందులోనే అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మసాలా దినుసులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీఆకు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి.దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసి కలపాలి. తరువాత వేయించిన క్యాలీప్లవర్ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై 6 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోబి మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాలీప్లవర్ తో ఈ విధంగా చేసిన మసాలా కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.