Pindi Chutney : మనం అల్పాహారాలను తినడానికి రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన చట్నీలల్లో పిండి చట్నీ కూడా ఒకటి. ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఉప్మా ఇలా ఏ అల్పాహారంతో తినడానికైనా ఈ చట్నీ చాలా చక్కగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేసుకోవడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. తరచూ తినే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పిండి చట్నీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎవరైనా చాలా సులభంగా చేసుకోగలిగే ఈ పిండి చట్నీని ఎలా తయారు చేసుకోవాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పిండి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టీ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు -ఒక రెమ్మ, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, చింతపండు పులుసు – రెండు కప్పులు, ఉప్పు – తగినంత, బెల్లం తురుము – 3 టీ స్పూన్స్, పచ్చి కొబ్బరి తురుము – 3 టీ స్పూన్స్, శనగపిండి – 4 లేదా 5 టీ స్పూన్స్.
పిండి చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం తరుగు, పపచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు చింతపండు రసం వేసి కలపాలి. తరువాత ఉప్పు, బెల్లం తురుము వేసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు ఉడికించిన తరువాత మంటను చిన్నగా చేసి కొబ్బరి తురుము వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ పులుసు గోరు వెచ్చగా అయిన తరువాత శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి చట్నీ తయారవుతుంది. ఇందులో బెల్లం తురుమును వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. చట్నీ పలుచగా కావాలనుకునే వారు చింతపండు పులుసును పలుచగా తీసుకోవాలి. గట్టిగా కావాలనుకున్న వారు చింతపండు పులుసును చిక్కగా తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన పిండి చట్నీతో మనం చేసుకునే ఏ అల్పాహారానైనా తీసుకోవచ్చు.