Aloo Majjiga Pulusu : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా ఈ బంగాళాదుంప వంటకాలను మనం తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాలల్లో ఆలూ మజ్జిగ పులుసు కూడా ఒకటి. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలు, పుల్లటి మజ్జిగ ఉంటే చాలు ఈ కూరను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ మజ్జిగ పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మజ్జిగ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
గసగసాలు -ఒక టేబుల్ స్పూన్, సోంపు గింజలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, లవంగాలు – 4, యాలకులు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 8, తరిగిన ఉల్లిపాయలు – 4, పసుపు – పావు టీ స్పూన్, నూనె – అర కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 5, పుల్లటి మజ్జిగ – 3 కప్పులు, ఉప్పు – తగినంత, కరివేపాకు -ఒక రెమ్మ, శనగపిండి – 3 టీ స్పూన్స్, నీళ్లు – పావు కప్పు.
ఆలూ మజ్జిగ పులుసు తయారీ విధానం..
ముందుగా జార్ లో గసగసాలు, సోంపు గింజలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ను వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత బంగాళాదుంపలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మంటను చిన్నగా చేసి మజ్జిగ, ఉప్పు , కరివేపాకు వేసి కలపాలి.
తరువాత ఒక గిన్నెలో శనగపిండిని తీసుకుని అందులో పావుకప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత దీనిని కూరలో వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మజ్జిగ పులుసు తయారవుతుంది. దీనిని అన్నం,చపాతీ, రోటీ, పులావ్, బిర్యానీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.