Masala Egg Omelette : కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆమ్లెట్ కూడా ఒకటి. ఆమ్లెట్ ను రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. దీనిని మనం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అయితే ఈ ఆమ్లెట్ ను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ మసాలా అమ్లెట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ ఆమ్లెట్ ను అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ మసాలా ఆమ్లెట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా ఎగ్ ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, ఉప్పు- కొద్దిగా, ధనియాల పొడి – అర టీ స్పూన్, నూనె- ఒక టీ స్పూన్.
మసాలా ఎగ్ ఆమ్లెట్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వీటిని సగానికి పైగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత గిన్నెలోకి కోడిగుడ్లను తీసుకుని బాగా కలపాలి. తరువాత వేయించిన ఉల్లిపాయలతో పాటు మిగిలిన పదార్థాలు కూడా వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. దీనిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా ఎగ్ ఆమ్లెట్ తయారవుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది.