Ragi Atukula Breakfast : రాగి అటుకులు.. రాగులతో చేసే ఈ అటుకులు చిన్నగా చాలా రుచిగా ఉంటాయి. ఇవి మనకు సూపర్ మార్కెట్ లలో, ఆన్ లైన్ లో సులభంగా లభిస్తాయి. రాగుల వలె ఈ అటుకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి అటుకులతో మనం రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. నీరసం మన దరి చేరుకుండా ఉంటుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి అటుకుల బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి అటుకుల బ్రేక్ ఫాస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన బాదంపప్పు – 10, పది నిమిషాల పాటు నానబెట్టిన చియా గింజలు – ఒక టీ స్పూన్, పటిక బెల్లం – ఒక టీ స్పూన్, నీళ్లు – ముప్పావు కప్పు, రాగి అటుకులు – ఒక కప్పు.
రాగి అటుకుల బ్రేక్ ఫాస్ట్ తయారీ విధానం..
ముందుగా బాదంపప్పుపై ఉండే పొట్టును తీసేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు, పటిక బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో రాగి అటుకులను తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న బాదంపాలు, నానబెట్టిన చియా గింజలు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఈ అటుకులను వెంటనే తినడం వల్ల కరకరలాడుతూ ఉంటాయి. అదే 5 నిమిషాల తరువాత తింటే అటుకుల నానిపోయి మెత్తగా ఉంటాయి. ఈ విధంగా రాగి అటుకులతో రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.