Chukka Kura Chutney : మనకు మార్కెట్ లో విరివిరిగా లభించే ఆకుకూరల్లో చుక్కకూర కూడా ఒకటి. దీనిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. చుక్కకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.బరువు తగ్గడంలో కూడా చుక్కకూర మనకు సహాయపడుతుంది. ఈ విధంగా చుక్కకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
చుక్కకూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చుక్కకూర పచ్చడి కూడా ఒకటి. చుక్కకూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతో రుచిగా ఉండే ఈ చుక్కకూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చుక్కకూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చుక్కకూర – పెద్దవి రెండు కట్టలు, తరిగిన ఉల్లిపాయ – 1, నువ్వులు – 2 టీ స్పూన్స్, చిన్న తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 3, ఎండుమిర్చి – 6, ఉప్పు -తగినంత, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర -ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్.
చుక్కకూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో అర టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించాలి. వీటిని దోరగా వేయించిన తరువాత జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు తరిగిన చుక్కకూర, ఉప్పు వేసి కలపాలి.
తరువాత దీనిపై మూత పెట్టి చుక్కకూరను మెత్తగా మగ్గించాలి. చుక్కకూర పూర్తిగా మగ్గిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చుక్కరకూర పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చుక్కకూరతో పచ్చడిని చేసుకుని తినడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు.