Protein And Weight Loss Dosa : మనం సాధారణంగా దోశలను మినపప్పు, బియ్యంతో తయారు చేస్తూ ఉంటాము. ఇది మనందరికి తెలిసిందే. మినపప్పుతో పాటు మనం ఇతర పప్పు దినుసులను కలిపి కూడా రుచికరమైన దోశలను తయారు చేసుకోవచ్చు. ఈ దోశలను తినడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ దోశలను తినడం వల్ల మనం మన శరీరానికి కావల్సినంత ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలను అందించవచ్చు. ఈ దోశలను తయారు చేసుకుని తినడం వల్ల ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ ప్రోటీన్ దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
3 గంటల పాటు నానబెట్టిన కొర్రలు – ఒక కప్పు, 3 గంటల పాటు నానబెట్టిన పెసర్లు – గుప్పెడు, 3 గంటల పాటు నానబెట్టిన శనగలు – గుప్పెడు, 3 గంటల పాటు నానబెట్టిన మినపప్పు- గుప్పెడు, 3 గంటల పాటు నానబెట్టిన బొబ్బర్లు – గుప్పెడు, మిరియాలు -ఒక టీ స్పూన్, కరివేపాకు -ఒక రెమ్మ, అల్లం – ఒక ఇంచు ముక్క, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు స్పూన్, ఉప్పు – తగినంత.
ప్రోటీన్ దోశ తయారీ విధానం..
ముందుగా జార్ లో కొర్రలు, పెసర్లు, శనగలు, మినపప్పు, బొబ్బర్లు, మిరియాలు, కరివేపాకు, అల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో ఇంగువ, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి టిష్యూ పేపర్ తో తుడవాలి. తరువాత పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి. దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. దీనిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ప్రోటీన్ దోశ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ప్రోటీన్ దోశను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.