Black Chana Masala Curry : మనం నల్ల శనగలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. నల్ల శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో, రక్తహీనతను తగ్గించడంలో, శరీరాన్ని బలంగా, ధృడంగా చేయడంలో, బరువు తగ్గడంలో ఇలా అనేక రకాలుగా నల్ల శనగలు మనకు దోహదపడతాయి. వీటిని గుగ్గిళ్లుగా చేసి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ నల్ల శనగలతో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు.
ఈ కూరను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. నల్ల శనగలతో చేసే ఈ కూర కమ్మటి వాసనతో చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. నల్ల శనగలతో రుచిగా మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల శనగల మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన నల్ల శనగలు – ఒక కప్పు, పల్లీలు – 2 టీ స్పూన్స్, నువ్వులు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, లవంగాలు – 2, యాలకులు – 2, టమాటాలు – 2, వెల్లుల్లి రెబ్బలు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క, నూనె – 3 టీ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు -ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
నల్ల శనగల మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా శనగలను బాగా కడిగి కుక్కర్ లో వేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు, ఒక స్పూన్ నూనె, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టాలి. ఈ శనగలను 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత నువ్వులు, జీలకర్ర కూడా వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని అందులోనే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో టమాట ముక్కలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేయించాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న టమాట పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత ఉడికించిన శనగలను వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాచేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగల మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పూరీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ శనగల కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.