Peethala Vepudu : మనలో చాలా మంది పీతలను ఇష్టంగా తింటారు. పీతలను శుభ్రం చేయడం కష్టమైనప్పటికి వీటితో వండే వంటకాలు మాత్రం చాలా రుచిగా ఉంటాయి. పీతలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పీతల వేపుడు కూడా ఒకటి. పీతలతో చేసే ఈ వేపుడు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. బ్యాచిలర్స్, వంటరాని వారు, మొదటిసారి చేసేవారు కూడా ఈ పీతల వేపుడును సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, తేలికగా పీతల వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పీతల వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
పీతలు – 5, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – ఒక రెమ్మ, ఉల్లిపాయలు – 2, టమాటాలు -2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పీతల వేపుడు తయారీ విధానం..
ముందుగా పీతలను ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత ఉల్లిపాయముక్కలను, టమాట ముక్కలను విడివిడిగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత టమాట పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత పీతలు వేసి కలపాలి.
తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మరోసారి అంతా కలుపుకుని మంటను చిన్నగా చేసి మూత పెట్టి వేయించాలి. తరువాత మూత తీసి మంటను పెద్దగా చేసి మరో 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పీతల వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పీతల వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.