Fruits : మనం అనేక రకాల పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే పండ్లల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అలాగే కార్బోహైడ్రేట్స్ తక్కువగా పండ్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే పండ్లను ఎవరైనా ఎక్కువగా తినవచ్చు. కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పండ్లను మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు, రక్తంలో ట్రై గ్లిజరాయిడ్స్ కలిగి ఉన్న వారు, ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉన్న వారు, ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు, శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్న వారు మాత్రం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోకూడదు.
ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే పండ్లల్లో ఖర్జూర పండ్లు కూడా ఒకటి. 100 గ్రా. ఖర్జూర పండ్లల్లో 144 కిలోక్యాలరీల శక్తి ఉంటుంది. షుగర్ తో వ్యాధితో బాధపడే వారు, అధిక బరువుతో బాధపడే వారు వీటిని తీసుకోకూడదు. ఒకవేళ తింటే ఒకటి లేదా రెండు పండ్లను మాత్రమే తినాలి. అలాగే 100 గ్రా. అరటిపండులో 116 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. కనుక అధిక బరువు, షుగర్ వ్యాధితో బాధపడే వారు ఒక చిన్న అరటి మాత్రమే తీసుకోవాలి. అది కూడా దోరగా పండిన అరటిపండును మాత్రమే తీసుకోవాలి. బాగా మగ్గిన అరటి పండును తీసుకోకూడదు. అలాగే అధిక కార్బోహైడ్రేట్స్ ఉన్న పండ్లల్లో సీతాఫలం కూడా ఒకటి. 100 గ్రా. సీతాఫలంలో 104 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు, అధిక బరువుతో బాధపడే వారు ఒకటి లేదా రెండు చిన్నగా ఉండే సీతాఫలాలను మాత్రమే తీసుకోవాలి. అదే విధంగా సపోటాలో కూడా పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

100 గ్రా. సపోటా పండులో 90 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు దోరగా పండిన సపోటాలను ఒకటి లేదా రెండు మాత్రమే తినాలి. అదే విధంగా 100 గ్రా. పనస తొనలలో 85 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. కనుక షుగర్ వ్యాధితో బాధపడే వారు, బరువు తగ్గాలనుకునే వారు రెండు లేదా మూడు పనస తొనలను మాత్రమే తినాలి. ఇక మామిడిపండులో కూడా పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రా., మామిడిపండులో 74 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు దోరగా మగ్గిన మామిడిపండ్లను తొక్కతో సహా తీసుకోవాలి. మామిడిపండ్ల రసాన్ని మాత్రం షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోకూడదు. షుగర్ వ్యాధి గ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారు, శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు ఈ పండ్లను తక్కువగా తీసుకోవాలని అప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయని బరువు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.