Cabbage Vepudu : మనం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాబేజిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. క్యాబేజితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యాబేజితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో క్యాబేజి వేపుడు కూడా ఒకటి. పెసరపప్పు, క్యాబేజి కలిపి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్యాబేజిని ఇష్టపడని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ క్యాబేజి వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజి వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తరిగిన క్యాబేజి – 200 గ్రా., నానబెట్టిన పెసరపప్పు – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్.
క్యాబేజి వేపుడు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత క్యాబేజి, పెసరపప్పు వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. క్యాబేజి, పెసరపప్పు మెత్తగా ఉడికిన తరువాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి వేపుడు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా క్యాబేజి వేపుడును తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.