Dharakshi : ధారాక్షి.. ఒడిస్సా వారి సాంప్రదాయ తీపి వంటకాల్లో ఇది కూడా ఒకటి. ధారాక్షి చాలా రుచిగా ఉంటుంది. దీనిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. పెసరపప్పు, మినపప్పుతో చేసే ఈ తీపి వంటకం క్రిస్పీగా, తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చూస్తేనే తినాలనిపించేత రుచిగా ఉండే ఈ ధారాక్షిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధారాక్షి తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు పెసరపప్పు – ముప్పావు కప్పు, పొట్టు మినపప్పు – పావు కప్పు, పంచదార – రెండు కప్పులు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి- పావు టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, ఉప్పు – చిటికెడు, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
ధారాక్షి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును, మినపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. పప్పు నానిన తరువాత కళాయిలో పాకం కోసం పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి జిగురు పాకం వచ్చిన తరువాత యాలకుల పొడి, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పప్పును శుభ్రంగా కడిగి గ్రైండర్ లో వేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల నీళ్లు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ ను లేదా పాల ప్యాకెట్ ను తీసుకుని అందులో గ్రైండ్ చేసుకున్న పిండిని ఉంచాలి.
తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని చూపుడు వేలు పొడవుతో కుర్ కురే ఆకారంలో వత్తుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై క్రిస్పీగా అయ్యే వరకు వేయించి బయటకు తీసి పంచదార పాకంలో వేసుకోవాలి. వీటిని 10 సెకన్ల పాటు పంచదార పాకంలో ఉంచి తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ధారాక్షి తయారవుతుంది. వీటిని వేడిగా తింటే క్రిస్పీగా ఉంటాయి. చల్లారిన తరువాత తింటే మెత్తగా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా రుచిగా ధారాక్షిని తయారు చేసుకుని తినవచ్చు.