Nuvvula Pachadi : క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాల్లో నువ్వులు కూడా ఒకటి. వంటలల్లో మనం నువ్వులను విరివిగా వాడుతూ ఉంటాము. నువ్వుల్లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఈ విధంగా అనేక రకాలుగా నువ్వులు మనకు సహాయపడతాయి. వంటల్లో వాడడంతో పాటు నువ్వులతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. నువ్వుల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే ఈ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. లొట్టలేసుకుంటూ తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ నువ్వుల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – అర కప్పు, నూనె – 3 టీ స్పూన్స్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 10, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాటాలు – 2, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 4, జీలకర్ర – అర టీ స్పూన్, చింతపండు – ఒక టీ స్పూన్.
నువ్వుల పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నువ్వులు వేసి చిన్న మంటపై దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఒక జార్ లో ముందుగా వేయించిన నువ్వులు, ఉడికించిన టమాట ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
అవసరమైతే నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు దోశ, ఇడ్లీ వంటి వాటితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన నువ్వుల పచ్చడిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.