Vankaya Palli Karam : వంకాయ పల్లికారం… వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. పల్లికారం వేసి చేసే ఈ వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. తరచూ ఒకేరకం వంకాయ ఫ్రై కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ వంకాయ పల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – పావుకిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 టీ స్పూన్స్, నూనె – 2 టీ స్పూన్స్, శనగపప్పు – ఒక టీస్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ధనియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 6, వెల్లుల్లి రెబ్బలు – 5, అల్లం – ఒక చిన్న ముక్క.
వంకాయ పల్లికారం తయారీ విధానం..
ముందుగా వంకాయలను ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత కళాయిలో పల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన పల్లీలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
తాళింపు చక్కగా వేగిన తరువాత వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. వంకాయ ముక్కలు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ పల్లికారం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలారుచిగా ఉంటుంది. వంకాయలను ఇష్టపడని వారు కూడా ఈ విధంగా తయారు చేసిన వంకాయ పల్లికారాన్ని ఇష్టంగా తింటారు.