Healthy Laddu : హెల్తీ లడ్డూ.. డ్రై ఫ్రూట్స్, గుల్కంద్ తో చేసే ఈ లడ్డూ చాలా రుచిగాఉంటుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ లడ్డూను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ లడ్డూలను తయారు చేయడం కూడా చాలా సులభం. రుచితో పాటు మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ హెల్తీ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెల్తీ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, బాదంపప్పు – ఒక కప్పు, జీడిపప్పు – అర కప్పు, గుమ్మడి గింజలు – అర కప్పు, పొద్దు తిరుగుడు గింజలు – అర కప్పు, పుచ్చకాయ గింజలు – అర కప్పు, అవిసె గింజలు – అర కప్పు, ఎండు ద్రాక్ష – పావు కప్పు, తామర గింజలు ( ఫూల్ మఖానా ) – ఒక కప్పు, ఎండు కొబ్బరి తురుము – అర కప్పు, ఖర్జూర పండ్లు – గుప్పెడు, గుల్కంద్ – తగినంత.
హెల్తీ లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత బాదంపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, పుచ్చకాయ గింజలు, అవిసె గింజలు వేసి వేయించాలి. వీటిని చక్కగా వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఎండు ద్రాక్ష, తామర గింజలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఎండు కొబ్బరి తురుము వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా జార్ లో వేయించిన బాదంపప్పు, జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత వేయించిన గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఎండుద్రాక్ష, ఫూల్ మఖనా, ఖర్జూర పండ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే వేయించిన కొబ్బరి తురుము వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా గుల్కంద్ ను, నెయ్యి వేసి కలుపుతూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హెల్తీ లడ్డూలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.