Pothappalu : పొతప్పలు.. బియ్యంతో చేసుకోదగిన తీపి వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ తీపి వంటకాన్ని పాతకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. బియ్యం, బెల్లంతో కలిపి చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ పొతప్పలను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసేవారు కూడా ఈ పొతప్పలను చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే పొత్తప్పలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొత్తప్పల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ముప్పావు కప్పు, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – 3 టేబుల్ స్పూన్స్, పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, యాలకులు – 3, బెల్లం తురుము – అర కప్పు లేదా తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పొత్తప్పల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, శనగపప్పు, మినపప్పును తీసుకోవాలి. తరువాత వీటిని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకుని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని అందులో పచ్చి కొబ్బరి తురుము, యాలకులు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత బెల్లం తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో చిటికెడు వంటసోడా వేసి కలపాలి. పిండి మరీ గట్టిగా ఉంటే తగినన్ని నీళ్లు పోసి దోశపిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక గంటెతో పిండిని తీసుకుని కళాయి మధ్యలో అప్పలాగా వేసుకోవాలి. ఈ పొత్తప్పలు నూనెలో కాలి పైకి తేలగానే మంటను మధ్యస్థంగా చేసి కాల్చుకోవాలి. ఒకవైపు ఎర్రగా కాలిన తరువాత మరోవైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొత్తప్పలు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా పొత్తప్పలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.