Allam Pulusu : మనం వంటల్లో అల్లాన్ని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వంటలల్లో అల్లాన్ని వాడడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇతర వంటలల్లో వాడడంతో పాటు అల్లంతో కూడా మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో అల్లం పులుసు కూడా ఒకటి. అల్లం పులుసు చాలా రుచిగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇలా అల్లం పులుసును తయారు చేసుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పులుసును తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ అల్లం పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్నవివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతులు – చిటికెడు, ఎండుమిర్చి – 6, ధనియాలు – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం – 2 ఇంచుల ముక్క, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, బెల్లం తురుము – పావు కప్పు.
అల్లం పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో మెంతులు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అదే జార్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాకర ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం పొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, బెల్లం తురుము, పులుసుకు తగినన్ని నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు ఇడ్లీ, దోశ వంటి వాటితో కూడా తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన అల్లం పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.