Soya Pakoda : సోయా పకోడా.. మీల్ మేకర్ తో చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఇవి కూడా ఒకటి. సోయా పకోడా చాలా రుచిగా, క్రీస్పీగా ఉంటాయి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మీల్ మేకర్ తో చాలా తేలికగా పకోడాలను చేసి పెట్టవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ పకోడాలను తయారు చేయడం కూడా చాలా సులభం. తరుచూ ఒకేరకం పకోడాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ సోయా పకోడాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోయా పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
సోయా చంక్స్ – ఒక కప్పు, బియ్యంపిండి – అర కప్పు, శనగపిండి – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ – 1, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
సోయా పకోడా తయారీ విధానం..
ముందుగా సోయా చంక్స్ ను వేడి నీటిలో వేసి 5నిమిషాల పాటు ఉంచాలి. తరువాత వాటిలో ఉండే నీటిని పిండేసి జార్ లోకి తీసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సోయా ఉండలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సోయా పకోడా తయారవుతుంది. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో సోయా పకోడాలను తయారు చేసుకుని తినవచ్చు.