Ashoka Halwa : మనం ఇంట్లో వివిధ రకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన తీపి వంటకాల్లో అశోక హల్వా కూడా ఒకటి. పెసరపప్పు, బెల్లం కలిపి చేసే ఈ హల్వా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ హల్వాను తయారు చేసుకోవడం చాలా సులభం. ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం లేదు. అలాగే చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ అశోక హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అశోక హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – అర కప్పు, వేడి నీళ్లు – 2 కప్పులు, బెల్లం తురుము – ఒక కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, గోధుమపిండి – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, పచ్చకర్పూరం – చిటికెడు.
అశోక హల్వా తయారీ విధానం..
ముందుగా పెసరపప్పును నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని తడిపోయేలా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పును కళాయిలో వేసి దోరగా వేయించాలి. తరువాత నీళ్లు పోసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. పెసరపప్పు మెత్తగా ఉడికి నీరంతా పోయిన తరువాత పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో బెల్లం తురుమును తీసుకుని అర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత వడకట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో బియ్యంపిండి, గోధుమ పిండి వేసి చిన్న మంటపై కలుపుతూ వేయించాలి.
దీనిని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పెసరపప్పు వేసి వేయించాలి. దీనిని 10 నుండి 15 నిమిషాల పాటు వేయించిన తరువాత బెల్లం నీరు పోసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తరువాత యాలకుల పొడి, కర్పూరం, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అశోక హల్వా తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు పెసరపప్పుతో అశోక హల్వాను తయారు చేసుకుని తినవచ్చు.