మనకు ఆహారం, నీరు ఎలాగో నిద్ర కూడా అంతే అవసరం. మనం రోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది 6 గంటల తక్కువగా నిద్రపోతున్నారని పరిశోధనలు తెలియజేసాయి. దీర్ఘకాలిక నిద్రలేమి, మరియు రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనం చాలా ప్రమాదకరమైన గుండె జబ్బుల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో గుండెపోటు, స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ డిసీస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణుల పరిశోధనల్లో తెలింది.
నిద్రలేమితనం గుడె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది… నిద్రలేమి కారణంగా మనం ఎదుర్కునే గుండె సంబంధిత సమస్యలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి కారణంగా అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణం. ఈ అధిక రక్తపోటు కారణంగా గుండెపై కలిగే అధిక ఒత్తిడి ధమనుల ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే నిద్రలేమి కారణంగా ధమనులు గట్టిపడతాయి. రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. గుండెలో మంట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా నిద్రలేమి కారణంగా గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి. దీని కారణంగా స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక నిద్రలేమి కారణంగా మన శరీరం యొక్క బరువు విపరీతంగా పెరుగుతుంది. ఇది క్రమంగా ఊబకాయానికి దారి తీస్తుంది. ఊబకాయానికి గుండె సమస్యలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. నిద్రలేమి ఇలా పరోక్షంగా కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే నిద్రలేమి కారణంగా శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది క్రమంగా టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తుంది. డయాబెటిస్ కూడా గుండె జబ్బులకు ప్రధాన కారకంగా ఉంటుంది.
ఇక నిద్రలేమి కారణంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విధంగా నిద్రలేమి మన గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని గుండె సంబంధిత సమస్యలు తలెత్తిన తరువాత బాధపడడం కంటే ముందుగానే జాగ్రత్త తీసుకోవడం అవసరమని వారు చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉండాలంటే రోజూ కనీసం 6 గంటల పాటు చక్కగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.